Omicron Outbreak వేళ..అంతర్జాతీయ విమానాల కేంద్రం గ్రీన్‌సిగ్నల్: వద్దంటూ

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. నెలల తరబడి లాక్‌డౌన్‌లో కొనసాగాయి. వాయు సంబంధాలు తెంచుకున్నాయి. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. భారత్‌లో 20 నెలలుగా అంతర్జాతీయ విమానయాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. డొమెస్టిక్ సర్వీసులను కేంద్రం నడిపిస్తోన్నప్పటికీ- ఇంటర్నేషనల్ సర్వీసులను రద్దు చేసింది.

డీజీసీఏ ఏం చెబుతోంది.. వందేభారత్ మిషన్ కింద పరిమితంగా కొన్ని సర్వీసులను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా- అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. వాటిపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి షెడ్యూల్ ఇంటర్నేషనల్ సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే డైరెక్టరేట్ ఇది.

సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న తరువాతే.. షెడ్యూల్ కమర్షియల్ ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామంటూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించాయి. డిసెంబర్ 15వ తేదీ నుంచి విదేశాలకు విమానాల రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నాయి. హోం, ఆరోగ్యం, విదేశాంగ మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేశాయి. ఆయా శాఖల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకున్నామని తెలిపాయి.

నిషేధం ఎత్తివేత.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించిన తరువాత కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. మే నెలలో దేశీయ సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ..ఇంటర్నేషనల్స్ జోలికి వెళ్లలేదు. వాటిపై విధించిన నిషేధాన్ని ప్రతి నెలా పొడిగించుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తరువాత మళ్లీ పొడించట్లేదని పౌర విమనాయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

వచ్చేనెల 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. భయానకంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికా, బోట్సువానాల్లో ఈ వైరస్ అవుట్ బ్రేక్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ అవుట్ బ్రేక్ (Omicron outbreak) పట్ల అప్రమత్తంగా కావాంటూ అన్ని దేశాలకు సూచనలను జారీ చేసింది.

పలు దేశాలు ట్రావెల్ బ్యాన్.. ఈ నేపథ్యంలో- అనేక దేశాలు దక్షిణాఫ్రికా సహా ఒమిక్రాన్ వేరియంట్ అవుట్ బ్రేక్ అయిన దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. షెడ్యూల్ కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశాయి. ఒమిక్రాన్ అవుట్ బ్రేక్‌తో ఇజ్రాయెల్, ఇటలీ, జర్మనీ, అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్‌తో విమాన సంబంధాలను తెంచుకుంటోన్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ వాటిని పునరుద్ధరించబోమని స్పష్టం చేశాయి.

ఈ పరిస్థితుల్లో అవసరమా? ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. తన నిర్ణయాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తోన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- ఈ డిమాండ్ లేవనెత్తారు కూడా. కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం ఆందోళనను కలిగిస్తోందని అన్నారు.

ఆ దేశాలకు విమానాలు నిలిపేయండి.. ఈ వైరస్ దేశంలో అడుగు పెట్టకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందిన దేశాలకు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేయాలని కోరారు. పలు దేశాలు ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకున్నాయని గుర్తు చేశారు. విమానాశ్రయాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత కట్టుదిట్టం చేయాలని, ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది