శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. దీంతో గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ దీనిచుట్టే కనిపిస్తోంది. క్రిప్టోలో లక్షలాదిమంది భారత ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. దీంతో అందరూ క్రిప్టో బిల్లు అంశానికి సంబంధించిన వివరాల కోసం వేచి చూస్తున్నారు. ప్రయివేటు క్రిప్టో కరెన్సీని, క్రిప్టో ఎక్స్చేంజీలని బ్యాన్ చేస్తారని లేదా తీవ్ర నియంత్రణ ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. లోకసభలో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.
ఇన్వెస్టర్ల ఆందోళన మన దేశంలో లక్షలాదిమంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారు. క్రిప్టో బిల్లు నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పతనమయ్యాయి. అయితే క్రిప్టోకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం అమలవుతుందా, నిషేధం సాధ్యమేనా అనే అంశాలపై చర్చ సాగుతోంది. పెట్టుబడిదారులపై క్రిప్టో బిల్లు ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆర్బీఐ ద్వారా కేంద్రం క్రిప్టో కరెన్సీని తీసుకు రావొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రయివేటు, ప్రభుత్వ క్రిప్టో కరెన్సీని వేరు చేయడం ద్వారా ప్రయివేటు క్రిప్టోను నిషేధించవచ్చు లేదా నియంత్రించవచ్చునని అంటున్నారు. అలాగే, క్రిప్టో లాభాలపై పన్నులు విధించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ సర్వర్ నుండి, ఎవరు అప్ లోడ్ చేస్తున్నారో తెలుసుకోవడం కాస్త కష్టమైన అంశం. అంతర్జాతీయ మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉంది. ఏదేమైనా క్రిప్టోను పూర్తిగా నిషేధించడం అసాధ్యమని అంటున్నారు. ఇప్పటికే చాలా క్రిప్టో ఎక్స్చేంజీలు ఉన్నాయి. సమగ్ర అధ్యయనం తర్వాత క్రిప్టో నిషేధం లేదా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
మరో దేశానికి.. క్రిప్టో బిల్లులో ఇన్వెస్టర్లకు రక్షణ ఉండవచ్చు. కానీ క్రిప్టో ఎక్స్చేంజీలతో పాటు బ్లాక్ చైన్, నాన్-ఫంగిబుల్ టోకెన్స్ కంపెనీల భవితవ్యం అనిశ్చితిలో పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్స్చేంజీలు యూఈఏ లేదా సింగపూర్ వంటి ఇతర దేశాలకు తరలి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రభుత్వం క్రిప్టోను నిషేధించే విధంగా బిల్లును తీసుకు వస్తే వ్యాపారాన్ని భారత్ నుండి మార్చడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.
ఎక్స్చేంజీల్లో రెండు రకాల మనదేశంలో పదిహేను వరకు క్రిప్టో ట్రేడింగ్ ఎక్స్చేంజీలు ఉన్నాయి. పది కోట్లకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. దేశంలో క్రిప్టో స్టార్టప్స్‌లలో యాభై వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. క్రిప్టోను నిషేధిస్తే ఈ ఉద్యోగులపై ప్రభావం ఉండవచ్చు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీల్లో రెండు రకాలు ఉన్నాయి. కొన్ని ఎక్స్చేంజీలు సెంట్రలైజ్డ్ కాగా, మరికొన్ని డీ-సెంట్రలైజ్డ్. ఈ రెండు కేటగిరీల ఎక్స్చేంజీల్లోను బెనిఫిట్స్, సేఫ్టీ రూల్స్, రిస్క్ ఇమిడి ఉంది. క్రిప్టో వ్యాలెట్ స్టోర్స్ వద్ద ప్రయివేటు కీలు ఉంటాయి. ఇన్వెస్టర్లకు వీటిని అందిస్తాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించిన స్టోర్స్‌లో క్రిప్టో కాయిన్స్ ఉంటాయి. ప్రయివేటు కీ నమోదు చేస్తేనే మరొకరి వ్యాలెట్‌లోకి నగదు పంపించేందుకు వీలవుతుంది. కీ వర్డ్ మరిచిపోతే ఇబ్బందులు తప్పదు.